నవ గ్రహ దేవతలందరూ పవిత్రులే. వీరు స్వయంగా ఎవరికీ ఏ శుభ ఫలితాలనూ ఇవ్వరు. ఆయా జీవులు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మలో రాబోతున్న ఫలితాలను సూచిస్తారు - అంత మాత్రమే.
పాప ఫలితాలను సూచించే గ్రహాలను పాపగ్రహాలనీ, పుణ్యఫలితాలను సూచించే గ్రహాలను శుభగ్రహాలనీ, ప్రాయశ్చిత్త కర్మలను నిర్ణయించే సౌకర్యం కోసం మాత్రమే విభజించారు. గ్రహ జపాదులన్నీ ప్రాయశ్చిత్త కర్మలే.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి