ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ముప్పది మూడు కోట్ల మంది దేవతలంటారు కదా, వారి వివరాలు ఏమిటి?

సమాధానం:   "లెక్కలేనంతమంది" అని చెప్పడానికే, ముప్ఫై మూడు కోట్ల దేవతలని, ముక్కోటి దేవతలని అంటారు. అట్లాగే "సహస్ర శీర్ష పురుష" అంటే అసంఖ్యాకమైన తలలు ధరించే శక్తి కలిగిన పురుషోత్తముడనే అర్థం చేసుకోవాలి. కేవలం వెయ్యి తలలు కలిగిన వాడనే అర్థంకాదు. అసలు ముప్పది ముగ్గురు  దేవతలనే వేదం చెప్పింది. అయితే వీరు ముప్ఫై మూడు వర్గాలకు చెందిన అనేకమంది దేవతలు. ఎనిమిది మంది వసువులు, పదకొండుమంది రుద్రులు, పన్నెండు మంది ఆధిత్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం ముప్పది ముగ్గురు. దేవతలకు వైద్యులే అశ్వనీ దేవతలు. అందరు దేవతలకంటే అన్ని విధాల అధికుడైన దివ్యతేజోమూర్తినే దేవుడు అని పిలవాలి.

స్తోత్రానికి, మంత్రానికి తేడా ఏమిటో చెప్పండి?

సమాధానం: భగవత్ స్తోత్రం ఏదైనా భాషా దోషాలు లేకుండా మీకు వచ్చిన, నచ్చిన శైలిలో రాగయుక్తంగానో, ఉత్తవచనంలోనే ఏదో ఒక పద్ధతిలో మనస్సు లగ్నంచేసి చదువుకోవచ్చు. అయితే పురుషసూక్తం వంటి వేదానికి చెందిన స్తోత్రాలను ఇప్పటికే వేద పండితులచే పఠింపబడుతున్న స్వరాలలోనే చదవాలి. వేదమంత్రాలు స్వరం మార్చి చదివితే అపార్థాలు, అనర్థాలు వచ్చే ప్రమాదం ఉన్నది. గాయత్రీ మంత్రం కూడా అలాంటిదే. ఒక్కోదాన్ని బట్టి స్వరం మారుతూ ఉంటుంది. స్తోత్రం ఎంత పెద్దదైనా ఉండవచ్చు, కాని మంత్రం సంపుటి అక్షరాలతో ఓంకారంతో చిన్నదిగానే ఉంటుంది.  ఉదా;- పంచాక్షరి, షడక్షరి, అష్టాక్షరి మొదలైనవి. మంతారంత్రాయతే ఇతి మంత్రః మననం (జపం) చేస్తే రక్షించేదే మంత్రం. మనస్సుకు శాంతిని, దాంతిని, అనన్య భక్తిని, సత్ప్రవర్తనను కలిగించేదే స్తోత్రం. స్తోత్రం గురూపదేశం లేకుండా చదువుకోవచ్చు. కాని మంత్రం గురూపదేశంపొంది, నియమనిష్ఠలతో జపిస్తేనే ఫలితానిస్తుంది.

మొదట వేదాలు పుస్తకరూపంలో లేవు కదా, వాటిని రాక్షసులెట్లా అపహరించారు? అవి బ్రహ్మకు మరలా ఎలా చేరాయి?

సమాధానం:   హయగ్రీవ అవతార కథంతా చెప్పుకుంటేగాని ఈ ధర్మసందేహం తీరదు. సృష్టి ఆరంభంలో పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని ఉపదేశించాడు. అప్పుడు బ్రహ్మ ఎదుట నాలుగు వేదాలు నలుగురు వేదపురుషులై సాక్షాత్కరించారు. అదే సమయంలో మధుకైటభులనే అసురులు వచ్చారు. వారు బ్రహ్మతో, వేదపురుషులతో తలపడి, నలుగురు వేదపురుషులను బందీలను చేసి రసాతలానికి తీసుకువెళ్ళిపోయారు. బ్రహ్మ వేడుకొనగా, పరమాత్మ రసాతలలోకానికి వెళ్ళి, హయగ్రీవ స్వరూపం ధరించి గట్టిగా సకలించాడట. ఆ ధ్వనికి భయపడి, అసురులు పారిపోగా హయగ్రీవుడు అక్కడున్న నలుగురు వేదపురుషులను జాగ్రత్తగా పైకి తెచ్చి బ్రహ్మకు మళ్ళీ అందించారు. హయగ్రీవుని సకిలింపు ఉద్గీధం అనే సామవేదగానంలా ఉంటుంది. ఆ తర్వాత ఆ రాక్షసులు విష్ణువుపైకి యుద్ధానికి వెళ్ళి, ప్రాణాలు పోగొట్టుకొన్నారు. హయగ్రీవుడు రూపుదాల్చిన విద్యగా ఆరాధనలందుకుంటున్నాడు. హయ అంటే అశ్వము, విజ్ఞానము. గ్రీవము అంటే కంఠము. అన్ని రకాల విద్యలు కంఠగతాలై ఉన్న సర్వ విద్యా స్వరూపమే.   గుర్రమువంటి శిరస్సు మానవదేహము కల హయగ్రీవమూర్తిని ఆయన అవతరించిన శ్రావణ పూర్ణిమ రోజున ఆయన్ను ఆరాధిస్తే, నిత్యము ధ్యానిస్తే సర్వవిద్యలను ప్రసాదిస్...

ఆకారత్రయం అంటే ఏమిటి? ఇది ఎవరికి వర్తిస్తుంది?

సమాధానం:   లక్ష్మీదేవి ఆకారత్రయ సంపన్న. అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం ఈ ముడు లక్ష్మీదేవి లక్షణాలు. అనన్య శేషత్వం అంటే అన్యులకు గాక భగవంతునికి మాత్రమే చెంది, ఆయన ఇష్టానికి తగినట్లుండడం. అనన్య శరణత్వం అంటే భగవంతుడు తప్ప మరో శరణ (రక్షకం) ఆమెకు లేదు. ఆమెకు దిక్కు, దీపమూ అంతా ఆయనే. అనన్య భోగ్యత్వం అంటే ఆమె భగవంతునిచే మాత్రమే భోగ్య అంటే అనుభవింపదగినది. అయితే ఈ మూడు లక్షణాలు ఆమెకే ఉన్నాయా? మరెవరికీ లేవా? ఎందుకు లేవు? జీవులందరికీ ఈ మూడు లక్షణాలు ఉండాలి. లక్ష్మీదేవి కూడ మన జీవకోటిలోనిదే. అయినా మనకన్నా ఎంతో మిన్న ఎందువల్ల? ఆమెకు మనలో ఉండని మరో రెండు విశిష్ట లక్షణాలున్నాయి. అవే ఘటకత్వం, ప్రాప్యత్వం. ఘటకత్వం అంటే జీవుల్ని భగవంతుడితో చేర్చే ఘటికురాలామె. ప్రాప్యత్వం అంటే పరమాత్మతో సమానంగా ప్రాప్యమైనది. అంటే పొందతగినది. ఆ దివ్య మిథునానికి (జంటకు) కైంకర్యం సమర్పించడమే మనకు మహాభాగ్యం. ఈ విధంగా జీవత్వ, ఘటకత్వం ప్రాప్యత్వములనే మూడు ఆకారాలు కలిగిన ఆమె అకార త్రయ సంపన్న. ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీ శిత్రీం వందే వరద వల్లభామే ఈ ధ్యాన శ్లోకంలో, శ్రీరంగం, తిరుమల, మేలుకోట, కా...

దైవప్రార్థనలో ఫలానా కోరికలు తీర్చమని ప్రార్థించవచ్చా?

సమాధానం:   కోరికలు కోరుతూ అయినా దైవానికి ప్రార్థన చేయవచ్చు, తప్పులేదు. అయితే మనం కోరినవన్నీ భగవంతుడు ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మన యోగ్యతను చూచి ఆయన ఇవ్వతగినవి ఇస్తాడు. మనం ఏమీ కోరుకోకుండా, ప్రార్థన చేస్తే తన ఔన్నత్యానికి దీటుగా ఔదార్యంతో మనకు ఏం కావాలో పరిశీలించి ఇస్తాడు. ఇదే గోదాదేవి మనకు చెప్పిన పాఠం. కోరిన దేవతలకు రాక్షసుల నుండి రక్షణ కల్పించాడు. ఏ కోరికలు కోరని ధృవుడికి శాశ్వత స్థానాన్ని ఇచ్చాడు. అయితే కోరికలు కోరడం, ఆపద మొక్కులు మ్రొక్కడం మానవ నైజం. అలాగే తన భక్తులను ఆదుకోవడం భగవంతుని కృపా విశేషం.

రామాయణంలో సుందరకాండకు ఆ పేరెలా వచ్చిందో దయచేసి తెల్పగలరు.

సమాధానం:   రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ మొదలైనవి పేర్లు చదివితేనే వాటిల్లో విషయమేమిటో తెలిసిపోతుంది. కానీ సుందరకాండకు ఆ పేరెలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ శ్లోకాలు చదవాలి. సుందరే సుందరోరామః సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం సుందరే సందరః కపిః సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? శ్రీరాముని సౌందర్యం, మూర్తిమత్వం, సుందరకాండలోనే అధికంగా వర్ణింపబడ్డాయి. అందుకే అది సుందరకాండ. సీతా సౌందర్యం, సౌశీల్యం ఎంత గొప్పవో దీనిలో నిరూపింపబడ్డాయి. అందుకే ఇది సుందరకాండ. ఈ కాండంలో ప్రధానపాత్ర హనుమ. ఆయనకు సుందరుడు అనే పేరుంది. సౌందర్యం ఆకారంలో ఉండదు. ప్రాకారం(నడత)లో ఉంటుంది. సీతారాములకు ఆనందం కలిగించిన అందగాడు ఆంజనేయుడు. సుందరకాండలో కథ బహుసుందరమైంది. కావ్య లక్షణాలలో ముఖ్యమైన శబ్ధం, అర్థం, రసం ఈ కాండలో సుందరంగా అమరి ఉన్నాయి. సుందరకాండ నవరసభరితం. ఆధ్యాత్మికంగా భగవత్ (శ్రీరాముని) సౌందర్యాన్ని, జీవ (సీత) సౌందర్యాన్ని, ఆచార్య (హనుమ) సౌందర్యాన్ని వర్ణించిన కాండ సుందరకాండ. అది సర్వాంగ సుందరం. సుందరకాండ మహిమాన్వితమైన మంత్రరాజం. అందమైన అశోకవనం సుందరకాండను శోభింపజేస్...

భక్తి మార్గాలెన్ని? ఆంజనేయస్వామిది ఏ మార్గం?

సమాధానం:   "భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు. వీటిలో మొదటిది శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. భగవంతుని గుణములను, నామాలను, కథలను ఎప్పుడూ వింటూ ఉండాలి. రెండోది కీర్తనం. ఆయన లీలలను నామాలను గానం, ప్రవచనం చేస్తూ ఉండాలి. మూడోది స్మరణం. ఇందులో భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. నాలుగోది పాదసేవనం. నిరంతరం ఆయన పాదాలను దర్శిస్తూ ఉండాలి. అయిదోది అర్చనం అంటే పూజించడం. ఆరోది వందనమంటే నమస్కారం. ఏడోది దాస్యం. స్వామికి దాసునిగా, భృత్యునిగా ఉండాలి. ఎనిమిదోది సఖ్యం చేయడం స్నేహం చేయడం. తొమ్మిదోది ఆత్మనివేదనం. తాను తనది అంతా ఉన్నది ఆయన కోసమే అని తెలుసుకుని భగవంతునికు సమర్పించాలి. ఏ విద్యకైనా పరమప్రయోజనం ఇదే అంటాడు ప్రహ్లాదుడు. కలియుగంలో అర్చామూర్తికే ఒకటి తర్వాత ఒకటిగా తర్వాత ఒకటిగా ఈ నవవిధ సేవలు అర్పించి, తరించాలి. ఆంజనేయస్వామివారిది "దాసోహం కోసలేంద్రస్య" అంటూ అధికంగా దాస్యభక్తినే ప్రదర్శిస్తాడు. శుభం భూయాత్