Skip to main content

Posts

Showing posts from June, 2020

మౌఢ్యమి అంటే ఏంటి.?

నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నవగ్రహాలలో భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి అది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాకపోతే మనం ఈ భూమ్మీద ఉన్నాం కాబట్టి నవ గ్రహాలలో ఈ భూమిని చేర్చకుండా సూర్యుని వాటిలో చేర్చారు మన పంచాంగకర్తలు. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీనినే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రునికి శక్తిహీనతే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య, గురు గ్రహ శక్తిహీనతను గురు మౌడ్యమి గానూ, శుక్ర గ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీనినే వ్యవహారిక భాషలో మూఢమి అని అంటారు. మౌడ్యమి ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదు.

మౌనం ఒక మంత్రం

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం *మంత్రౌషథ   సమాగమాః * దాన మానా వమానాశ్చ నవ గోప్యాః  మనీషిభిః                       మనిషి అంటే సామాన్య మానవుడు. మనీషి అంటే ఉదాత్త మానవుడు. అలాంటి వారు 9 విషయాలలో గోప్యతను పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆవేమనగా  1. మన ఆయుష్షు మనకు తెలియదు. ఒక వేళ సిద్ధులు, యోగుల వలన తెలిసినా ఆడంబరంగా చెప్పుకోకూడదు. 2. మన నగ నట్రా, పొలాలు, స్థలాలు, నిధి నిక్షేపాలు పరులకు చెప్పరాదు.   3.ఇంటిగుట్టు గుట్టుగానే ఉంచాలి. రచ్చ చేయరాదు.  4. తేలు, పాము, విశేష మంత్రాలతో రోగులకు సేవ చేయవచ్చు. కాని ఆ మంత్రం వెల్లడించరాదు.   5. అలాగే దివ్యౌషథంతో రోగాలు నయం చేయవచ్చు కాని దాని మర్మం విప్పరాదు.   6.కీలక వ్యక్తులతో చేసిన మంతనాలను, చర్చలను బట్టబయలు చేయరాదు. ప్రాణాలకే ముప్పు రావచ్చు. 7.మనం చేసిన దానం, ధర్మం, ఉపకృతి రెండో చేతికే తెలియకూడదంటారు.  దర్పంగా చెప్పుకోరాదు.   8. మన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా జరిగిన గౌరవాన్ని, సన్మానాన్ని మనమే గొప్పగా చెప్పుకోకూడదు. పేలవంగా ఉంటుంది.   9.మనకు ఇంటిలో గాని, ఆఫీస్ లోగాని, ఇతరత్రా గాని అవమానం ఎదురైతే సరిదిద్దుకోడానికి ప్రయత్నించాలే కాని, పది మందిలో అల్లరి చేసుకోర

మంచి మాట - 16

ఎక్కువ కావాలి అనుకొనే వారికి అన్నీ కష్టాలే. తక్కువ చాలు అనుకొనే వారికి అన్నీ సుఖాలే.

జీవితమే మనకొక పరీక్ష

జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం. పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి? పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది. బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి. బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు. చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. పక్షికి తుపాను పరీక్ష, పాముకు గద్ద పరీక్ష! పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి దేవుడు పరీక్షలు పెట్టడు. మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.

మంచి మాట - 14

ఒకరు మన కోసం మారతారని సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తున్న మారలేదంటే, ఇంక మారాల్సింది వాళ్లు కాదు మనమే మారాలి. మనం అంటే విలువ లేని వారి దగ్గర వాళ్ల కోసం ఆలోచించడం వృధా.

మంచి మాట 13

సందర్భానికి అనుగుణంగా పలికిన మాట, సద్భావంతో ప్రియమైన మాట, తన పౌరుషానికి తగ్గ కోపం ఇవేవీ వృథా కావు.

పరోపకారాయ ఫలంతి వృక్షాః - Stotras and Slokas - 6

పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్ధమిదం శరీరమ్ చెట్లు పండ్లను ఇస్తాయి, నదులు తియ్యటి నీటిని ప్రవహింపచేస్తున్నాయి, ఆవులు బలవర్ధకమైన పాలనిస్తున్నాయి, ఎవరూ అడగకుండానే ఇవన్నీ ఇస్తున్నాయంటే పరులకు ఉపకారాన్ని చేయడము కోసమే. అందుకే మన శరీరాన్ని కూడా ఇతరులకు ఉపకారాన్ని చేయడానికే వినియోగించాలి‌ కదా?

మంచి మాట 12

నదిని దాటుటకు ఈత అవసరమైనట్లు సంసారమును దాటుటకు బ్రహ్మవిద్య అవసరము. కావున దానిని పొందుటకు మానవుడు ప్రయత్నించవలయును.

మంచి మాట 11

ధనం నుండి గుణం రాదు. ధనం మరియు ఇతర అన్ని మంచి విషయాలు వ్యక్తులకు గుణం నుండే వస్తాయి.

కుర్వాణః కృషిమమితాం మితంశయానః - Stotras and Slokas - 5

కుర్వాణః  కృషిమమితాం మితంశయానః భూంజానో మితమమితం పరందదానః జానానో బహువిషయాన్ మితం బ్రువాణః ఉత్కర్షం భువిలభతే సవర్థమానః ఎక్కువగా పనిచెయ్యడము, మితంగా నిద్రపోవడము, మితంగా తినడము, ఇతరులకు పెట్టడము, అనేక విషయాలను తెలిసి ఉండి కూడా మితంగానే మాట్లాడడము...వీటిని ఎవరు చేస్తారో వారు లోకములో వృద్దిలోకి‌ వస్తారు. ఉన్నతస్థితి పొందుతారు.

మంచి మాట 10

మన సంపదల్ని మనం శాసించగలిగితేనే మనం నిజమైన, స్వతంత్రులమైన శ్రీమంతులం. కానీ మన సంపద మనల్నే శాసిస్తుంటే, మనం నిజానికి సిరికి సామంతులమే.

యః స్పష్ట్వా కురుతే కార్యం - Stotras and Slokas - 4

యః స్పష్ట్వా కురుతే కార్యం ప్రష్టవ్యాన్ స్వహితాన్ గురూన్ నతస్య జాయతే విఘ్నః కశ్మిం శ్చిదపి కర్మణి ఎవరైనా ఒక కార్యాన్ని సాధించ దలచు కున్నప్పుడు, తన‌ మేలు కోరే వారు, సలహా చెప్పదగిన పెద్దలయిన వారిని సంప్రదించాలి. అలా చేస్తే ఆ కార్యమెప్పటికీ చెడిపోదు.

ఆచార్యాత్ పాద మాదత్తే - Stotras and Slokas - 3

ఆచార్యాత్ పాద మాదత్తే పాదం శిష్య: స్వమేధయా పాదం సహచరై  స్సాకమ్ పాదం  కాల క్రమేణ   చ                           వయో నిమిత్తం లేకుండా మనం ఒక విద్యలో  పారంగతులము అవ్వాలంటే దానికి 4 అధ్యయన సోపానాలు ఉన్నాయి. 1. గురువుగారు పాఠం చెప్పగానే  ఒక పావు వంతు మాత్రమే మన బుర్రకెక్కుతుంది. 2. మనం ఏకాగ్రత, శ్రద్ధ, ఆసక్తులతో స్వయంగా  మేథోమథనం  చేయడం వల్ల మరో పావువంతు అవగతమవుతుంది. 3. అధ్యయన శీలురైన  తోటి మిత్రులతో  సాంగోపాంగంగా, కూలంకషంగా చక్కగా చర్చించడం వల్ల మరో పావువంతు అవగాహన అవుతుంది. 4. అలా నేర్చుకున్న విద్యను కాలక్రమేణ నిరంతరం మననం చేసుకొంటూ, పదిమందికి పంచడం ద్వారా  దానిపై  పూర్తి  సాధికారికత, సమగ్రత  సిద్ధిస్తుంది.

మంచి మాట 8

భగవంతుడు ఇస్తాడు, దీవిస్తాడు. మానవుడేమో గ్రహిస్తాడు, మరుస్తాడు. ఏమారుస్తాడు కూడా.

మంచి మాట 7

మనం ఎంత శ్రీమంతులమో తెలుసుకోవాలంటే, సిరి సంపదలతో కొనలేనివి మన వద్ద ఎన్ని ఉన్నాయో లెక్క వేసుకోవాలి.

కష్టాలకైనా సుఖాలకైనా మనం చేసుకున్న పాప పుణ్యాలే కారణం

భగవంతుడు ఏ ఒక్కరికో  ప్రత్యేకంగా కష్టాలను గానీ సుఖాలను గానీ ఇవ్వడము జరుగదు. ఆయన సృష్టి అంతంటినీ సమముగానే ప్రేమించును. కష్టాలకైనా సుఖాలకైనా మనం చేసుకున్న పాప పుణ్యాలే కారణం. మంచి చేసేవానికి ఆలస్యమైనా మంచే జరుగుతుంది. చెడు చేసేవానికి చెడే జరుగుతుంది. కర్మ ఎవరికీ చుట్టం కాదు! భగవంతుడు క్షమించినా, కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. పాపము, హింస పెచ్చరిల్లిపోయినపుడు కర్మకు భగవంతుడు కూడా అడ్డు చెప్పలేడు! ప్రతీ దానికి భగవంతుని నిందించడం మానుకుని పాప కర్మల జోలికి పోకుండా తమను తాము కట్టడి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికి భగవన్నామ స్మరణ ఓ చక్కనైన ఉపాయం. భగవన్నామ స్మరణ చేయుట వలన మనస్సు చాలా వరకు అదుపులోకి వస్తుంది. పాప కర్మలు చేయుటకు మనసు సహకరించదు. తద్వారా ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. పాప కర్మలు తగ్గి పుణ్య కర్మలు వైపు మనసు మరలుతుంది. ఇది అత్యంత శుభ పరిణామం.

మంచి మాట 6

మనలోని పాప ప్రవృత్తిని మన సౌభాగ్యం, మనలోని పుణ్య ప్రవృత్తిని మన దౌర్భాగ్యం బాగా వెలికి తీస్తాయి. సౌభాగ్యంలో మనం ఎవరో మన స్నేహితులకు తెలుస్తుంది. కానీ దౌర్భాగ్యంలో మన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుంది.

మంచి మాట 5

విలాసాలు ఎక్కువ ఉన్నవారు కాదు, అవసరాలు తక్కువగా ఉన్నవారే నిజానికి శ్రీమంతులు. యోగి వేమన గారి ప్రకారం అప్పు లేని వారే అధిక సంపన్నులు.

దేవుడికి మొక్కుకొని, గండం గడచిన తర్వాత ఆ మొక్కు తీర్చకపోతే ఏమవుతుంది?

సమాధానం: ఇది మీ మనస్సాక్షిని మీరు అడగవలసిన ప్రశ్న. ఆపదలలో గట్టెక్కడానికి దేవుడికి మ్రొక్కుకొని, ఆ తర్వాత తీర్చకపోతే మీ మనస్సాక్షి ఊరుకోదు. మిమ్మల్ని అనుక్షణం నిలదీస్తూనే ఉంటుంది. వాగ్ధాన భంగం చేసుకున్న మీరు మానసిక ఒత్తిడికి గురై అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అయితే భగవత్ పరంగా చూస్తే, మీ మొక్కుబడికి భగవంతుని ద్వారా మీరు పొందే ఉపశమనానికి సంబంధం ఉండదు. భగవంతుడు మీ ఆర్తిని చూస్తాడేగాని, మీరు మ్రొక్కే మొక్కుబడుల బరువును చూడడు. మనం భావిస్తున్నట్లుగా, మొక్కుబడుల వల్ల మనకొచ్చే ప్రయోజనాలను, మనం నిష్పత్తులతో లెక్కగట్టి హుండీలో వేసే డబ్బుకు సంబంధంలేదు. ఆలస్యంగానైనా ఏ దేవుడి మొక్కు ఆ దేవుడి వద్దే తీర్చడం మంచిది. ఇవన్నీ మన సంతృప్తికి, మనం అనుకున్న మాట నెరవేర్చుకోవడం కోసం చేసే కార్యాలే.

విద్యా వివాదాయ ధనం మదాయ - Stotras and Slokas - 2

విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ దుర్మార్గుడు విద్యను వివాదం కొరకు ఉపయోగిస్తాడు. అతని ధనం మదానికి కారణం అవుతుంది. అతని శక్తి ఇతరులను పీడించడానికి ఉపయోగపడుతుంది. సత్పురుషునికి మాత్రం విద్య వల్ల జ్ఞానం కలుగుతుంది, ధనం వల్ల దాతృత్వం అబ్బుతుంది. అతని శక్తి సమాజాన్ని రక్షించడం కోసం ఉపయోగపడుతుంది.

మంచి మాట 4

మనం నడిచే మార్గాలలో ఇతరులు అంతరాయం కలిగించవచ్చు. ఆ అంతరాయం నుండే ఒక బలమైన పునాది నిర్మించాల్సి ఉంటుంది.      అవసరాలు కొత్త దారులు వెతికితే, అనుభవాలు కొత్త పాఠాలు నేర్పుతాయి.

దినసరి పంచాంగము - ॐ 04-06-2020 (Daily Panchangam)

"దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం, బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం" ॐ 04-06-2020. ॐ గురువారము. ॐ శ్రీ శార్వరీ  నామ సంవత్సరం. ॐ ఉత్తరాయణము.  ॐ గ్రీష్మ  ఋతువు. ॐ జ్యేష్ఠ  మాసం. ॐ శుక్ల   పక్షం. ॐ చతుర్ధశి  తిథి రా" 02-45 వ. ॐ విశాఖ  నక్షత్రం సా" 06-14 వ.  ॐ వర్జ్యము రా" 10-02 > 11-33 వ. ॐ రాహుకాలం;- ప" 1-30 >  3-00. ॐ దుర్ముహూర్తం;- ఉ" 10-00 > 10-48. ॐ పునర్ద్ముహూర్తం;- మ" 02-48 > 03-36. ॐ యమ గండం;- ఉ" 06-00 > 07-30.

మంచి మాట 3

మనం ఒకరికి సాయం చేస్తే మనకు అవసరమైనపుడు అడవిలోనైనా సరే సాయం దొరుకుతుంది. అదే మనం ఎవరికీ సాయపడకపోతే ఎంత ధనవంతుని దగ్గరకు వెళ్లినా ఏమీ లాభం ఉండదు.

జీర్యంతే జీర్యతః కేశాః - Stotras and Slokas - 1

జీర్యంతే  జీర్యతః  కేశాః దంతాః  జీర్యంతి జీర్యతః జీర్యతః  చక్షుషీ  శ్రోత్రే తృష్ణా ఏకా తరుణాయతే                      మనిషి శైశవ, బాల్య, కౌమార, యౌవన దశలను  జవ సత్త్వాల జోరులో  సంతోషంగా  గడిపి, వృద్ధాప్యంలోకి రాగానే, మన ప్రమేయం లేకుండానే క్రమంగా శిరోజాలు  తెల్లబడి,   రాలిపోతుంటాయి.  కొన్ని టన్నుల ఆహారాన్ని నమలడంలో అలసి, సొలసిన దంతాలు  ఊడి పోతుంటాయి. సమస్త ఇంద్రియాలలో తలమానికమై, జీవితానికే చుక్కాని వంటి  కళ్ళు కనబడని పరిస్థితి దాపురిస్తుంది. ఇష్టమైనా, కష్టమైనా పుంఖాను పుంఖాలుగా ఎన్నో విషయాలు విని, విని    చెవులు వినబడకుండా పోతాయి. కాని మనం పుట్టగానే మనతో పుట్టిన ఆశ మాత్రము కరగని, తరగని  నిత్య నూతన యౌవనంతో  మిస మిసలాడుతున్నది. కాన బాల్యంలో భక్తి బీజాలను అంకురింప జేసుకొని, కౌమారంలో బలపడి, యౌవనంలో స్థిరపడి, పలు క్షేత్రాలు, తీర్ధాలు దర్శించి, ముదిమిలో  ఆశలను విడనాడి, జీవన్ముక్తికి  సాధన చేయాలి.

శ్రీనరసింహ శతకము

(01) శ్రీమనోహర సురార్చిత సింధుగంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశిపు నాశక శూర సాధురక్షణ శంఖచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతలజాల పల్లవారుణ పాదపద్మ యుగళ చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలేవాడవు. దుష్టులను శిక్షించువాడవు. స్వామీ! నీవు శ్రీదేవికి భర్తవు. దేవతలచే పూజింపబడువాడవు. సాగర గంభీరుడవు. భక్తులను బ్రోచెడివాడవు. శతసహస్ర సూర్య తేజోమయుడవు. కమలనేత్రుడవు. హిరణ్యకశిపుని అంతమొందించిన శూరడవు. సాధుజన రక్షకుడవు. శంఖ చక్ర విరాజితుడవు. ప్రహ్లాదునికి వరములిచ్చినవాడవు. పాప సంహారుడవు. సర్వేశుడవు. పాలకడలిపై పవ్వళించినవాడవు. నల్లనివాడవు. గరుడవాహనుడవు. తుమ్మెదల వంటి నల్లనైన వెంట్రుకలు గలవాడవు. చిగురుటాకుల వంటి ఎర్రని చరణద్వయము కలవాడవు. శ్రీచందనాది సుగంధ ద్రవ్యములచే పూయబడిన పరిమళ దేహము కలవాడవు. మల్లెమొగ్గల వంటి దంత సౌందర్యం కలవాడవు. జైనారసింహా

దినసరి పంచాంగము - ॐ 03-06-2020 (Daily Panchangam)

" ప్రియంగు కళికా శ్యామం రూపేణా ప్రతిమాం బుధం, సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం" ॐ 03-06-2020. ॐ బుధవారం. ॐ శ్రీ శార్వరీ  నామ సంవత్సరం. ॐ ఉత్తరాయణము.  ॐ గ్రీష్మ  ఋతువు. ॐ జ్యేష్ఠ మాసం. ॐ శుక్ల  పక్షము ॐ ద్వాదశి  తిథి ఉ" 07-17 వ. ॐ తదుపరి త్రయోదశి  రా"తె" 04-53 వ. ॐ స్వాతి నక్షత్రము  రా" 07-42  వ  ॐ వర్జ్యము రా" 12-57 > 02-28.   ॐ రాహు కాలం;- మ" 12-00 > 01-30. ॐ దుర్ముహూర్తం;- మ" 11-36 > 12-24. ॐ యమగండం;- ఉ" 07-30 > 09-00. సర్వేజనా సుఖినో భవంతు

మంచి మాట 2

అసూయతో ఉండే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో గర్వించే వారికి మంచి మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితం ఉండదు.

గీతా పరిష్కారం అన్నింటికి దిగులే

అన్నింటికి దిగులే క్లైబ్యం మాస్మ గమః పార్థ, నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయదౌర్భల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప నిరుత్సాహ పడకూడదు. మనలో శక్తి మనకు తెలియదు. ఎన్నో మంచి విజయాలను సాధించిన మనం ఇలాగా కుంగిపోయేది? ధైర్యం తెచ్చుకోవాలి. నీచమైన పిరికితనాన్ని  వదలిపెట్టాలి. ఉత్సాహంతో దైవం మీద భారం వేసి మన కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టాలి. తప్పక లక్ష్యాన్ని సాధిస్తాము.

సందేహం: మహాభాగవతంలో రాధ పాత్రలేదంటారు. మరి ఎక్కడ ఉందో చెప్పండి.

సమాధానం :- నిజమే, భాగవతంలో రాధ లేదు. శ్రీకృష్ణుని భార్యగా రుక్మిణీ దేవికే మనం పట్టంకడతాం. తమిళ సంప్రదాయంలో నీళాదేవి (నప్పిన్న) శ్రీకృష్ణుని పట్టపుదేవి. అయితే ఉత్తరాది అంతటా రాధకే హారతి పడతారు. రాధేశ్యాం అంటూనే ఒకరినొకరు పలకరించుకోవడం అక్కడి ప్రజలకు అలవాటు. రాథే రాథే అంటూ వారు తన్మయులై భజనలు చేస్తారు. బ్రహ్మవైవర్త పురాణంలో రాధ ప్రస్తావన ఉంది. ద్వాపర యుగంలో రాక్షసరాజులు చాలామంది ప్రజలను పీడిస్తూ ఉంటే భూమాత భరించలేక బ్రహ్మతో మొరపెట్టుకుంది. అప్పుడు బ్రహ్మ భూదేవిని, మహేశ్వరుని, నారాయణుని వెంటపెట్టుకుని గోలోకం వెళతాడు. అక్కడ రాసమండలంలో రాధతో విహరిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి, స్తుతిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడే అందరికీ చిరునవ్వుతో అభయమిచ్చి తాను ద్వాపరాంతంలో గోకులంలో అవతరిస్తానని, అలాగే దేవతలందరూ గోపాలురుగా, యాదవులుగా జన్మిస్తారని, వృషభానుని కుమార్తెగా రాధ, మహాలక్ష్మి భీష్మకుని పుత్రిక రుక్మిణిగా జన్మిస్తారని చెపుతాడు. ఇదీ బ్రహ్మవైవర్త పురాణంలోని రాధాకృష్ణుల గాథ. భాగవతంలో రాధ ఊసేలేదు.

మంచి మాట 1

మనకు ఉన్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే, కానీ మనకు ఉన్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం.